: అయొడిన్ లేని ఉప్పుపై నిషేధం?
అయొడిన్ లేని ఉప్పును వాడవద్దని నిపుణులు చెబుతున్నారు. మన శరీర ఎదుగుదలకు అయొడిన్ ఎంతగానో తోడ్పడుతుంది. మనం సాధారణంగా వాడే ఉప్పులో అయొడిన్ శాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటి సాధారణ ఉప్పును నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోందట.
ఆరోగ్య శాఖ, యూనిసెఫ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లు కలిసి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో గ్లోబల్ అయొడిన్ డెఫీషియన్సీ డిజార్డర్ ప్రివెన్షన్ దినోత్సవాన్ని సోమవారం నాడు నిర్వహించాయి. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముఫ్ఫై శాతం మంది అయొడిన్ లోపంతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. అయొడిన్ గర్భస్థ శిశువులకు, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, చిన్న పిల్లల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని సహానీ అన్నారు.
ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ సాదా ఉప్పును నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. కాబట్టి అయొడిన్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ ఉపయోగాలు గురించి మనకు తెలిసినా వాటిని మనం పట్టించుకోం. అలాకాకుండా మనం సాధారణంగా వాడే ఉప్పులో అయొడిన్ తగు మోతాదులో ఉండేలా చూసి కొనడం వల్ల మనతోబాటు మన కుటుంబ సభ్యులను కూడా ఆరోగ్యంగా ఉండేలా చేయవచ్చు.