: సోనియాను వ్యతిరేకించే సత్తా సీఎంకు ఉందా?: దాడి
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వ్యతిరేకించే సత్తా సీఎం కిరణ్ కు ఉందా? అని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, సీఎం అధిష్ఠానంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఆయన నిజంగానే విభజనను వ్యతిరేకిస్తే సీఎం పదవి నుంచి ఎప్పుడో పీకిపారేసేవాళ్ళని దాడి వివరించారు. సోనియా డైరక్షన్ లోనే కిరణ్ వ్యవహారం నడుపుతున్నాడని ఆరోపించారు. విభజన ప్రకటన తర్వాత కాంగ్రెస్ కు ఓట్లు రాలవని తెలిసి, సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నాడని తెలిపారు. ఆ నూతన పార్టీ సాయంతో ఓట్లు దక్కించుకోవాలన్నది సోనియా, కిరణ్ ల ఎత్తుగడ అని పేర్కొన్నారు.
సీడబ్ల్యూసీ ప్రకటన వెంటనే సీఎం రాజీనామా చేసి ఉంటే సోనియా దిగివచ్చేవారని అభిప్రాయపడ్డారు. కిరణ్ తాను రాజీనామా చేయకపోగా, మంత్రుల రాజీనామాలకూ అడ్డుపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు నేటికీ స్పష్టత ఇవ్వడంలేదని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై తన అభిప్రాయం చెప్పకుండా నెట్టుకొస్తున్నాడని విమర్శించారు. బాబు ఎవరి ఆత్మగౌరవం కోసం యాత్రలు చేస్తున్నారో చెప్పాలని దాడి డిమాండ్ చేశారు.