: బీహార్ మధ్యాహ్న భోజన ఘటనలో ప్రిన్సిపాల్ పై ఛార్జ్ షీట్
సంచలనం సృష్టించిన బీహార్ మధ్యాహ్న భోజన ఘటనలో పాఠశాల ప్రిన్సిపాల్ పై ఛార్జ్ షీట్ నమోదైంది. ఆమెతో పాటు భర్తపై కూడా అభియోగాలు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఛార్జ్ షీట్ ను సరన్ జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ కు ఈ రోజు సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. 346 పేజీల ఛార్జ్ షీట్ లో ప్రిన్సిపాల్ మీనాదేవి ఆమె భర్త అర్జున్ రాయ్ పేర్లు పేర్కొన్నట్లు వెల్లడించారు. ప్రిన్సిపాల్ భర్త రాయ్ ఓ షుగర్ ఫ్యాక్టరీ నుంచి పురుగుల మందును కొని, దాన్ని మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే వస్తువులున్న గదిలో పెట్టాడని వారు వివరించారు. అనంతరం పిల్లలకు వండే భోజనంలో ఆ మందు కూడా కలిసిందని ఛార్జ్ షీట్ లో సవివరంగా తెలిపినట్లు పోలీస్ అధికారి రాజ్ కౌశల్ చెప్పారు. జులై 16న బీహార్ లో చోటు చేసుకున్న ఈ ఘటనలో 23 మంది విద్యార్ధులు మరణించగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రిన్సిపాల్ ను, ఆమె భర్తను అరెస్టు చేయడంతో ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు.