: మోడీ మాటలకు చిన్నబుచ్చుకున్న 'బంగారు' సాధువు
మోడీ వ్యాఖ్యలు సాధువు శోభన్ సర్కార్ కు మనస్తాపం కలిగించాయి. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లా దాండియాఖేరా గ్రామంలో కోటలో 1000 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ ఈ సాధువుకి వచ్చిన కల ఆధారంగానే అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిని మోడీ విమర్శించారు. సాధువు కల ఆధారంగా బంగారం కోసం వెతుక్కునే దుస్థితికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందని విమర్శించారు. దీంతో సాధువు శోభన్ సర్కార్ మోడీకి ఒక బహిరంగ లేఖ రాశారు.
లేఖలో మోడీ విమర్శలను సాధువు ప్రశ్నించారు. సోనియాను, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా తననూ అగౌరవపరిచారని లేఖలో పేర్కొన్నారు. 'భారత్ ను ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిని చేయాలన్నదే స్వామి శోభన్ సర్కార్ కల' అంటూ ఆ లేఖలో మోడీకి తెలిపారు. భారత భూభౌతిక సర్వే విభాగం నివేదిక ఆధారంగానే తవ్వకాలు జరపాలంటూ తాను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరానని ఆయన వివరించారు. 'మీ లాంటి రాజకీయ నేతలు అలాంటి వ్యాఖ్యానాలతో సమయాన్ని వృథా చేయకండి' అంటూ సాధువు మోడీకి చురకంటించారు. దీంతో, మోడీ సాధువు లేఖకు ట్విట్టర్లో స్పందించారు. 'లక్షలాది మంది భక్తులు సాధువు శోభన్ సర్కార్ ను విశ్వసిస్తారు. నేను ఆయనను ఎంతో గౌరవిస్తున్నాను' అంటూ వినమ్రంగా బదులిచ్చారు.