: మంకీ గేట్ గురించి నేనూ రాస్తా : అనిల్ కుంబ్లే
తాను కూడా త్వరలోనే ఓ పుస్తకం రాయబోతున్నానని... అందులో మంకీ గేట్ కు సంబంధించిన వాస్తవాలన్నీ బయటపెడతానని భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తెలిపారు. ఐదేళ్ల క్రితం సిడ్నీలో జరిగిన టెస్టులో భజ్జీ, సైమండ్స్ గొడవపడ్డారు. ఈ వివాదం మంకీ గేట్ గా ప్రాచుర్యం పొందింది. ఈ టెస్ట్ మ్యాచ్ కు కుంబ్లే భారత కెప్టెన్ గా వ్యవహరించారు. పాంటింగ్ తన పుస్తకంలో మంకీ గేట్ ఉదంతాన్ని పేర్కొంటూ... అందులో టెండూల్కర్ పాత్రను ప్రశ్నించాడు. దీనికి ప్రతిస్పందనగా... మంకీ గేట్ గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయని కుంబ్లే అన్నారు. ఈ గొడవకు సంబంధించిన వాస్తవాలన్నీ బయటకు రావాల్సిన అవసరముందని తెలిపారు. నిజానిజాలను తెలుసుకోవాలంటే... తన పుస్తకం వచ్చే వరకు వేచి చూడాలని కుంబ్లే అన్నారు.