: పోర్టబులిటీ కోసం 10 కోట్ల దరఖాస్తులు
మొబైల్ నంబర్ పోర్టబులిటీ సదుపాయాన్ని సెల్ వినియోగదారులు విపరీతంగా వాడేస్తున్నారు. నంబర్ మారే పని లేకుండానే నెట్ వర్క్ ఆపరేటర్ ను మార్చుకోవడానికి పోర్టబులిటీ వీలు కల్పిస్తుంది. 2011 జనవరిలో ఇది అందుబాటులోకి రాగా ఇప్పటి వరకూ 9.80 కోట్ల మంది నెట్ వర్క్ ఆపరేటర్ ను మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నట్లు ట్రాయ్ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఒక్క ఈ ఏడాది జూలై నెలలో పోర్టబులిటీ కోసం వచ్చిన దరఖాస్తులు 22 లక్షలుగా ఉన్నాయి. గతేడాది ఆఖరు వరకు ఒక సర్కిల్ పరిధిలో మాత్రమే ఆపరేటర్లను మార్చుకునే వీలుండగా, ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో ఏదేనీ సర్కిల్ నుంచి వేరొక సర్కిల్ పరిధిలోకి కూడా మారే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.
కర్ణాటకలో 1.14 కోట్ల మంది, రాజస్థాన్ లో 95.8 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్ లో 89 లక్షల మంది పోర్టబులిటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదటి మూడు స్థానాల్లో ఈ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా, జులై నాటికి దేశంలో 87.5కోట్ల మంది జీఎస్ఎం వినియోగదారులు ఉన్నట్టు తెలుస్తోంది.