: ఒక కన్ను చాలట!
అదేంటి, ఈ ప్రపంచాన్ని చూడడానికి ఒక కన్ను చాలని అంటున్నామనుకుంటున్నారా... అదేంకాదులెండి. త్రీడీ చిత్రాలను చూడడానికి ఒక కన్ను చాలని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ రెండు కళ్లతో అయితే త్రీడీ చిత్రాలను చక్కగా చూసి, అనుభూతి చెందవచ్చు అనుకునేవాళ్లం. కానీ ఒక కన్నున్నా చాలని, త్రీడీ చిత్రాలను చక్కగా చూడవచ్చని పరిశోధకులు తేల్చారు. త్రీడీ చిత్రాలను చిత్రించే స్టీరియోస్కోపు పరిజ్ఞానాన్ని 1838లో కనుగొన్నారు. ఇక అప్పటినుండీ సాధారణ చిత్రాలతో పోల్చినప్పుడు వీటిలో లోతు తెలుస్తుండేది. ఏదైనా ఒక ఖాళీ ప్రదేశాన్ని త్రీడీ చిత్రాల్లో చూసినప్పుడు మనం లోతును అనుభూతి చెందవచ్చు. సాధారణంగా రెండు కళ్లచూపు కలిగిన వారు ప్రపంచాన్ని కూడా ఇలాగే అనుభూతి చెందగలరు. అలాగే త్రీడీ చిత్రాలను చూడడానికి కూడా రెండు కళ్లు అవసరం అని ఇప్పటి వరకూ భావించేవారు. కానీ రెండు కళ్లు కాక ఒక కన్ను ఉన్నా చాలని, త్రీడీ చిత్రాలను చక్కగా అనుభూతి చెందవచ్చని పరిశోధకులు తమ పరిశోధనలో తేల్చారు.
భారత సంతతికి చెందిన ధనరాజ్ విశ్వనాథ్ కూడా ఉన్న శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనల్లో త్రీడీ చిత్రాలను చూసి అనుభూతి చెందడానికి ఒక కన్ను ఉన్నా చాలని నిరూపించబడింది. రెండు కళ్లతో రెండు చిత్రాలను గ్రహించి వాటిని మెదడులోని దృశ్య కార్టెక్స్ భాగంలో కలిపినప్పుడు త్రీడీ అనుభూతి కలుగుతుందనే భావన ప్రస్తుతం వ్యాప్తిలో ఉంది. అలా కాకుండా త్రీడీ చిత్రాలను చూడడానికి రెండు కళ్లు అవసరం లేదని, ఒక కన్ను ఉన్నా చాలని సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్ధారించారు. ఒక చిన్న రంధ్రం గుండా ఒకే కన్నుతో సాధారణ చిత్రాన్ని చూడడం ద్వారా త్రీడీ అనుభూతిని పొందవచ్చని తాము ప్రయోగపూర్వకంగా నిరూపించామని ధనరాజ్ విశ్వనాథ్ తెలిపారు. ఒకే కన్ను ఉన్నవారు, రెండు కళ్ళతో చూడటంలో ఇబ్బందులు ఎదురయ్యేవారికి తమ పరిశోధనతో ప్రయోజనం ఉంటుందని ధనరాజ్ తెలిపారు. త్రీడీ పరిజ్ఞానంపై కూడా ఇది ప్రభావాన్ని చూపుతుందని, చౌకైన విధానాల ద్వారా త్రీడీ అనుభవాన్ని సృష్టింవచ్చని, చిత్రాల రిజల్యూషన్‌ను పెంచడం ద్వారా కూడా త్రీడీ అనుభూతిని పొందవచ్చని తమ పరిశోధనలో తేలిందని ధనరాజ్ తెలిపారు.