: మారుమూల పల్లెలైనా వైర్‌లెస్ పనిచేస్తుంది
మారుమూల పల్లెలకు ఇంటర్నెట్ అనేది సాధ్యమయ్యేది కాదు. అలాకాకుండా వైర్‌లెస్ పద్ధతిలో మారుమూల పల్లెలకు సైతం సమాచారాన్ని చేరవేయవచ్చని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు ఒక సెకనులో వంద గిగాబైట్ల సమాచారాన్ని వైర్‌లెస్ ద్వారా పంపించి రికార్డు సృష్టించారు.
జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు ఫోటానిక్ పద్ధతిలో 237.5 గిగాహెర్జ్ పౌన:పున్యం ఉన్న ఒక వాహకం ద్వారా 20 మీటర్ల పరిధిలో వైర్‌లెస్ పద్ధతిలో సెకనుకు వంద గిగాబైట్ల సమాచారాన్ని పంపించారు. ఫోటానిక్ పద్ధతిలో సదరు వాహకంలో రేడియో సంకేతాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు దీన్ని సాధించారు. జర్మనీలోని కార్ల్‌స్రూ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విజయాన్ని సాధించారు. ఈ పరిశోధనకు సారధ్యం వహించిన ప్రొఫెసర్ ఇంగ్‌మర్ కాల్‌ఫస్ మాట్లాడుతూ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌లను వేయడానికి సాధ్యంకాని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పరిజ్ఞానం ద్వారా సమాచారాన్ని చేరవేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము సాధించిన వేగంతో ఒక బ్లూరేడిస్క్ లేదా ఐదు డీవీడీల్లోని సమాచారాన్ని కేవలం రెండు సెకన్ల వ్యవధిలో ఒక పరికరం నుండి మరొక పరికరానికి బదిలీ చేయవచ్చని ఇంగ్‌మర్ చెబుతున్నారు.