: ఇక ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు సునామీని చెప్పేస్తాయి


మీరు ఉపయోగించే ల్యాప్‌ట్యాప్‌ లేదా మీ స్మార్ట్‌ ఫోన్‌ ఇకపై సునామీ తలెత్తే ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందేలా ఒక సరికొత్త వ్యవస్థను శాస్త్రవేత్తలు రూపొందించారు. రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎక్కడో సముద్రంలో తలెత్తే సునామీలను గురించి ల్యాప్‌ట్యాప్‌లకు, స్మార్ట్‌ ఫోన్‌లకు హెచ్చరికలతో కూడిన సందేశాలను పంపించే అత్యాధునిక ఇంటర్నెట్‌ వ్యవస్థను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు.

భూమిపై ఉండే వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌లు రేడియో తరంగాలపై ఆధారపడి పనిచేస్తాయి. అయితే నీటిలోపల రేడియో తరంగాలు సరిగా పనిచేయలేవు. దీంతో పలు అగ్రదేశాలకు సంబంధించిన వాతావరణ సంస్థలు ధ్వని తరంగాలపై ఆధారపడి సముద్రగర్భం ద్వారా సమాచారాన్ని పంపిణీ చేస్తాయి. అలాకాకుండా సముద్రగర్భంలో ఉండే సెన్సర్ల ద్వారా సునామీకి సంబంధించిన సమాచారాన్ని అప్పటికప్పుడు పంపించేలా సరికొత్త ఇంటర్నెట్‌ పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. బఫెలో విశ్వవిద్యాలయానికి చెందిన టామసో మెలోడియా నేతృత్వంలోని పరిశోధకుల బృందం రూపొందిస్తున్న ఈ ఇంటర్నెట్‌ వ్యవస్థ సముద్రాల్లో పెరిగిపోతున్న కాలుష్య మోతాదును గుర్తించడానికి, నిఘా వ్యవహారాలను నిర్వహించడం వంటి పనుల్లో కూడా చక్కటి సమాచారాన్ని అందించి సహకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇప్పటివరకూ వివిధ దేశాలు రూపొందించుకున్న వాతావరణ సమాచార సేకరణా వ్యవస్థ ప్రత్యేమైన లక్షణాలను కలిగివుంటున్న కారణంగా వేర్వేరు దేశాలమధ్య సమాచార వినిమయం సాధ్యం కావడంలేదు. అయితే మెలోడియా బృందం ఇంటర్నెట్‌ ఆధారంగా రూపొందించిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఈ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని సూచించింది. సముద్రగర్భంలో ఇప్పటికే ఉన్న సెన్సర్‌ వ్యవస్థలద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించే విధానానికి వీరు నాంది పలికారు. ఈ సమాచారం ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు వంటి వైర్‌లెస్‌ పరికరాలకు తక్షణం చేరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News