: ఉద్యోగం లేదన్న కారణంతో కొడుకును చంపిన తండ్రి
కొడుకు ఉద్యోగం లేకుండా తిరుగుతుండడం ఆ తండ్రి భరించలేకపోయాడు. ఆగ్రహం పట్టలేక చేతిలో ఉన్న కత్తితో గొంతుకోసి చంపాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. ఉత్తర చెన్నైలోని తిరువికా నగర్ లో నివాసముండే నటరాజన్ (56)కు కమల్ (33) అనే కుమారుడున్నాడు. పేపర్ మిల్స్ రోడ్డులో నివాసముండే కమల్ కు పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నా, ఉద్యోగం లేదు.
నిన్న ఆయుధ పూజ సందర్భంగా తల్లిదండ్రులను పలకరించిపోదామని కమల్ వచ్చాడు. ఆ సమయంలో నటరాజన్ ఉల్లిపాయలు కోస్తూ ఉన్నాడు. 'ఇంకా ఉద్యోగం సంపాదించుకోలేదా?' అని తండ్రి గట్టిగా ప్రశ్నించడంతో కమల్ కూడా ఆగ్రహంతో బదులిచ్చాడు. దీంతో, వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చేతిలో ఉన్న కత్తితో నటరాజన్.. కమల్ గొంతు కోశాడు. ఇది చూసిన తల్లి పరుగుపరుగున వచ్చి కమల్ ను ఆసుపత్రికి తరలించింది. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. నటరాజన్ ను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.