: జలప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ సునయన' యుద్ధనౌక
సముద్ర జలాల్లో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఉద్దేశించిన 'ఐఎన్ఎస్ సునయన' యుద్ధనౌక ఈ రోజు జలప్రవేశం చేసింది. సదరన్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ సోని దీన్ని జలప్రవేశం చేయించారు. ఈ నౌకను గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో నిర్మించారు. ఈ నౌక ద్వారా మన నౌకాదళ అవసరాలు చాలా వరకు తీరనున్నాయి. నిఘా అవసరాలతో పాటు, సముద్ర జలాల్లో భద్రతాపరమైన చర్యలకు ఉపయోగపడేలా దీన్ని నిర్మించారు.
ఐఎన్ఎస్ సునయనలో రెండు డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇందులో అత్యాధునిక నేవిగేషన్ సిస్టం, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ సపోర్ట్ సిస్టం ఉన్నాయి. ఈ నౌకలో ఆటోమేటిక్ పవర్ మేనేజ్ మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది హెలికాప్టర్ ను కూడా తీసుకెళ్లగలదు. ఈ యుద్ధనౌక గంటకు 25 నాటికల్ మైళ్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లగలదు. ఇందులో 8 మంది ఆఫీసర్లు, 108 మంది సెయిలర్లు ఉంటారు.