: రిటైర్మెంట్ తర్వాత సచిన్ ఏం చేయబోతున్నాడు..?
సచిన్ టెండూల్కర్ ను కొందరు క్రికెట్ మాస్టర్ అంటారు. కొందరు క్రికెట్ దేవుడంటారు. మరి అంతటి గుర్తింపున్న సచిన్ 200వ టెస్ట్ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడు. 40 ఏళ్ల సచిన్ ఆ తర్వాత ఏం చేస్తాడు? అన్నది ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల మదిలో ఉన్న ప్రశ్న.
సచిన్ సై అంటే చాలు ఆయన ప్రతిభకు సలాం కొట్టే పదవులు చాలానే ఉన్నాయి. క్రికెట్ మాస్టర్ గా పాఠాలు చెప్పవచ్చు. ఐపీఎల్ లో ఏదేనీ జట్టుకు లేదా టీమిండియాకు కోచ్ అవతారం ఎత్తడానికి సచిన్ కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు అనిల్ కుంబ్లే మెంటార్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
గవాస్కర్, రవిశాస్త్రి, మంజ్రేకర్ రిటైరయ్యాక కామెంటేటర్లుగా అవతారమెత్తారు. సచిన్ వీరి బాటలో వెళ్లే అవకాశాన్నీ కొట్టిపారేయలేం. బీసీసీఐలో కొలువుకు అవకాశం వస్తుందేమో చూడాలి. పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూనే క్రికెట్ రంగానికి మేలు చేయడం, సేవా కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సచిన్ 40 ఏళ్లకే ప్రజల మనసుల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు కనుక, ప్రజల కోసం ఏదైనా చేయవచ్చు. కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.