: బొజ్జ పెరిగితే బుర్ర తగ్గుతుందిట!


వయసు పెరిగేకొద్దీ కొందరికి బొజ్జ పెరుగుతుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, అలాగే అతిగా ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం చేయకుండా బద్దకంగా ఉండడం వంటి పలు కారణాల వల్ల పొట్టభాగంలో కొవ్వు చేరడంతో బొజ్జ పెరుగుతుంటుంది. ఇలా బొజ్జ పెరగడం వల్ల క్రమేపీ జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యవయసులో ఉండేవారికి బొజ్జ సమస్య ఉంటుంది. మన శరీరంలో కొవ్వును నియంత్రించే ప్రోటీను మెదడులో కూడా మెమరీని అదుపులో ఉంచుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

రష్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వారు సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో శరీరంలో కొవ్వును అదుపులో ఉంచే ప్రోటీనే మెదడులో మన అభ్యసనాన్ని, జ్ఞాపకశక్తిని నియంత్రిస్తుందని తేలింది. శరీరంలో ఉండే కాలేయం కొవ్వు నిల్వలను అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. కాలేయంలోని పెరాక్సిసమ్‌ ప్రొలిఫరేటర్‌-ఆక్టివేటెడ్‌ రెస్పిరేటర్‌ అల్ఫా (పిపిఎఆర్‌అల్ఫా) కొవ్వు జీవక్రియలను అదుపులో ఉంచుతుంది. అతిగా కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల కాలేయంలో విడుదలయ్యే పిపిఎఆర్‌అల్ఫా విడుదల స్థాయి తగ్గిపోతుంది.

ఫలితంగా పొట్ట భాగంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ పిపిఎఆర్‌అల్ఫా తగ్గిపోవడం వల్ల దీని ప్రభావం మెదడుపైన కూడా ఉంటుంది. ఫలితంగా క్రమేపీ జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి కొవ్వు పదార్ధాలను తక్కువగా తీసుకోవడం వల్ల బొజ్జ పెరగకుండా చూసుకోవచ్చు. ఫలితంగా మనం ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం.

  • Loading...

More Telugu News