: తలనొప్పిని మరచిపోవచ్చు!
భరించలేని తలనొప్పిని తగ్గించుకోవడానికి పలు రకాల మందులను వాడుతుంటాం. అలాకాకుండా తలనొప్పికి ప్రత్యేకమైన మందులు వాడకుండా ఎంచక్కా చిన్న మీటను నొక్కడం ద్వారా మన తలనొప్పి ఇట్టే తగ్గిపోతుందట. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఒక సరికొత్త పరికరాన్ని కనుగొన్నారు. ఈ పరికరాన్ని తలనొప్పి ఉండేవారి తలలో అమరుస్తారు. ఈ పరికరానికి ఒక మీటను అనుసంధానిస్తారు. తలనొప్పి కలిగిన సమయంలో ఆ మీటను నొక్కినట్టయితే తలనొప్పిని క్షణాల్లో తగ్గించివేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రెండు సంవత్సరాల క్రితం వైద్యులు ఒక పరికరాన్ని ఒక పేషంటు పుర్రెలో అమర్చారు. ఆ తర్వాత సదరు పేషంటు తలనొప్పికి సంబంధించి ఎలాంటి బాధను భరించాల్సిన అవసరం రాలేదట. ఎందుకంటే పుర్రెలో అమర్చిన చిన్న పరికరానికి సంబంధించిన కంట్రోల్ బాక్స్‌ని ఆమె వీపు దిగువభాగాన అమర్చారు. తలనొప్పి అనిపించిన సమయంలో కంట్రోల్ బాక్స్‌కు సంబంధించిన మీటను నొక్కడం ద్వారా విద్యుత్తు వైరు ద్వారా మెదడులో తలనొప్పిని కలిగించే నరానికి చేరుతుంది. ఈ విద్యుత్తు నరంలో తలెత్తిన తలనొప్పిని దాదాపుగా 70 శాతం వరకూ తగ్గిస్తుందని చెబుతున్నారు. ఈ పరిశోధనలు మరింత అభివృద్ధి చెందితే మరో రెండేళ్లకు తలనొప్పి అనే బాధను చరిత్రలోకి చేర్చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.