: 64 మందిని బలిగొన్న వదంతి
మధ్యప్రదేశ్ లోని దాతియా దగ్గర రతన్ గఢ్ గుడిలో జరిగిన తొక్కిసలాటలో మరణించినవారి సంఖ్య 64కు చేరింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. దుర్గాపూజ నిమిత్తం భక్తులు ఆలయానికి పోటెత్తడంతో సింధ్ నదిపై ఉన్న ఇరుకైన వంతెన దాటేందుకు భక్తులు బారులు తీరారు. ఇంతలో వంతెన కూలిపోతోందంటూ వదంతులు వ్యాప్తి చెందాయి. ఘటన నిజమని నమ్మిన భక్తులు ఎవరికి వారు ప్రాణాలు రక్షించుకుందామని పరుగులు తీశారు. ఆ ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు ఇతరుల కాళ్ల కింద నలిగి మృత్యువాత పడగా, మరి కొందరు నదిలో దూకి ప్రాణాలు రక్షించుకుందామని ప్రయత్నించి కొట్టుకుపోయారు.
కాగా, భక్తులను నియంత్రించడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని వస్తున్న వార్తల్ని దంతియా ఎమ్మెల్యే నరోత్తం మిశ్రా ఖండించారు. మరణించినవారికి రూ. 1.50 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50 వేలు, గాయపడినవారికి రూ.25 వేలు నష్టపరిహారంగా అందించనున్నట్టు మధ్యప్రదేశ్ సర్కారు ప్రకటించింది.