: పాన్ కార్డు రూపంలో నయా ఓటర్ కార్డు


ఓటరు కార్డుల నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు కొత్త కార్డులను పరిచయం చేయబోతుంది. ప్రస్తుతం అందరి ఓటర్ కార్డులు నలుపు, తెలుపుల్లో ఫోటోతో ఉన్నాయి. వీటిస్థానంలో ఇకనుంచి కలర్ పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డు రూపంలో ఉండే కొత్త వాటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ కార్డులో పాన్ కార్డులో వున్నట్టుగానే కలర్ ఫోటో కూడా వుండటం దీని ప్రత్యేకత. తొలిసారిగా ఈ పైలట్ ప్రాజెక్టును ఎన్నికల కమిషన్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో, ఘజియాబాద్ లలో చేపట్టబోతుంది. ఇందుకోసం ఇప్పటికే ఆ రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి సంబంధిత అధికారులను ఎన్నికల కమిషన్ పంపింది.

ఈ కొత్త గుర్తింపు కార్డు నామమాత్రపు ఫీజుతో ఓటరుకు జారీ చేస్తామని యూపీ ఎన్నికల ముఖ్య అధికారి ఉమేష్ సిన్హా తెలిపారు. అంతేగాక, కొత్తగా ఓటరు కార్డు తీసుకునే వారికి కూడా ఈ గుర్తింపు కార్డును ఇస్తామని చెప్పారు. పాత ఓటరు కార్డుల్లో ఫోటోలో, పేరులో ప్రింటు నాణ్యత లోపాలు వున్నాయనీ, అయితే ఈ కొత్త కార్డులో అలాంటి సమస్య లేకుండా ఉంటుందనీ అన్నారు. చూసేందుకు అందంగా, అధునాతనంగా కనిపించే ఈ గుర్తింపు కార్డువల్ల ఇబ్బందులు వుండవని వివరించారు.

కార్డు పొందాలనుకునే వారు పాస్ పోర్టు సైజ్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు ఇవ్వవలసి వుంటుందన్నారు. కొత్తగా పొందే కార్డుతో ఓటర్లు నెట్ లోనే తమ పోలింగ్ బూత్ ను గుర్తించే అవకాశం వుందన్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్ అత్యధిక జనాభా గల రాష్ట్రం కావడంతో ముందుగా అక్కడి నుంచి దీనిని ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2014 ఎన్నికల నాటికి 127.3 మిలియన్ వున్న ఓటర్లు 130 మిలియన్ కు చేరతారని అధికారులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News