: తనయుడికి ములాయం వార్నింగ్


ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుండగా, జాతీయస్థాయిలో అఖిలేశ్ యాదవ్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ముజఫర్ నగర్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాన ఓటు బ్యాంకు అయిన ముస్లింలు పార్టీకి దూరమవుతారేమోనన్న ఆందోళన సమాజ్ వాదీ అధినాయకుల్లో కలుగుతోంది. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. తొలుత తనయుడు అఖిలేశ్ తో పాటు అతని మంత్రి వర్గ సహచరులను ఘాటుగా హెచ్చరించారు. తప్పులు దిద్దుకోకుంటే పరిస్థితి విషమిస్తుందని తెలిపారు.

లక్నోలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అఖిలేశ్ సర్కారు తీరు మార్చుకోకుంటే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. పొత్తుల ద్వారా గెలుపుపై ఆశలు పెట్టుకోవాల్సిన దుస్థితి కల్పించవద్దని తనయుడికి సూచించారు. గత నెలలో ముజఫర్ నగర్ జిల్లాలో జరిగిన అల్లర్లలో జాట్ వర్గీయులు ముస్లింలపై దాడులు చేయడంతో 60 మంది మరణించిన సంగతి తెలిసిందే. 45 వేల మందికి పైగా చెల్లాచెదురయ్యారు. దీంతో, ముస్లింలలో సమాజ్ వాదీ పార్టీపై విశ్వాసం క్రమంగా సడలుతోందన్న వార్తల నేపథ్యంలో అధినేత ములాయం రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. కాగా, తన కుమారుడి సర్కారు చేసిన తప్పులకు తనను శిక్షించవద్దంటూ ఆయన ప్రజలను అర్థించారు.

  • Loading...

More Telugu News