: రాహుల్ కు ఆశాభంగం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆశాభంగం తప్పలేదు. విషయం ఏమిటంటే.. ఉత్తరప్రదేశ్ లో ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ రెండు సభలు నిర్వహించాలని నిర్ణయించింది. హమీర్ పూర్, సలీమ్ పూర్ పట్టణాల్లో ఈ సభలు ఏర్పాటు చేశారు. అయితే, అదే రోజున హిందువులు 'కార్వాచవితి' పర్వదినం జరుపుకోనున్నారు. దీంతో, ఆ రోజున ప్రజలు తమ సభలకు రాకపోవచ్చన్న అనుమానం కాంగ్రెస్ నేతల్లో పొడసూపింది. సభలకు రాహుల్ హాజరు కానుండడంతో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయకపోతే అభాసుపాలవుతామని భావించిన యూపీ కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గారు. వెంటనే సభలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇంతకుముందు రాంపూర్, అలీగఢ్ లో నిర్వహించిన సభలకు ప్రజలు భారీ సంఖ్యలో రాకపోవడం కాంగ్రెస్ నేతలను నిరాశకు గురిచేసింది. ఎన్నికలు సమీపిస్తుండగా, అత్యధిక లోక్ సభ స్థానాలున్న యూపీలో పార్టీ పుంజుకోవాలంటే ఈ పరిస్థితి తొలగిపోవాలని వారు కోరుకుంటున్నారు.