: రాణించిన జహీర్.. భారత్-ఏ ఇన్నింగ్స్ విజయం
సీనియర్ పేసర్ జహీర్ ఖాన్ చాన్నాళ్ళకు బంతితో మెరిశాడు. విండీస్-ఏ జట్టుతో కర్ణాటకలోని హుబ్లీలో జరుగుతున్న మూడవ అనధికార టెస్టు మ్యాచ్ లో భారత్-ఏ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 296 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కరీబియన్లను జహీర్ తన పదునైన బంతులతో బెంబేలెత్తించాడు. 16.5 ఓవర్లు విసిరిన ఈ లెఫ్టార్మ్ సీమర్ 59 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. విండీస్-ఏ బ్యాట్స్ మెన్ లో నర్సింగ్ దేవ్ నారాయణ్ (99) రాణించాడు. సెంచరీకి పరుగు దూరంలో జహీర్.. నర్సింగ్ ను బలిగొన్నాడు. మరో బ్యాట్స్ మన్ ఫుడాడిన్ (49) పోరాడినా అదీ కాసేపే. జహీర్ కు తోడు మిగతా బౌలర్లు తలో చేయి వేయడంతో లంచ్ తర్వాత కాసేపటికే విండీస్-ఏ ఇన్నింగ్స్ కు 242 పరుగుల వద్ద తెరపడింది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో విండీస్-ఏ 268 పరుగులు చేయగా, భారత్-ఏ 9 వికెట్లకు 564 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ చటేశ్వర్ పుజారా (306) ట్రిపుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా, తాజా విజయంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ ను భారత్-ఏ 1-1తో సమం చేసింది. అంతకుముందు మైసూర్ లో జరిగిన తొలి మ్యాచ్ లో విండీస్-ఏ జట్టు నెగ్గగా.. రెండో మ్యాచ్ డ్రాగా ముగిసింది.