: తప్పుడు నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ నిపుణులకు జైలు శిక్ష
ఒక ఆస్తి వివాదం కేసులో ప్రైవేటు వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగా తప్పుడు నివేదిక ఇచ్చిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ మాజీ శాస్త్రవేత్తలకు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్షలను ఖరారు చేసింది. ఢిల్లీలో 2005లో జరిగిన ఓ ఆస్తి వివాదానికి సంబంధించి... అమ్మకపు ఒప్పందంపై సంతకం సరైందా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించడంలో ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్లు అయిన మిట్టల్, వికె.ఖన్నాలు తప్పుడు నివేదిక సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వీరిరువురూ నేరానికి పాల్పడ్డారని తీర్పు ఇచ్చింది. మిట్టల్ కు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 70 వేల జరిమానా విధించింది. అలాగే, ఖన్నాకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధించింది. తప్పుడు అగ్రిమెంట్ పత్రాలు సృష్టించిన ముద్దాయి రమేశ్ శర్మకు రెండేళ్ల కారాగార శిక్షతో పాటు రూ. 30 వేల జరిమానా విధించింది. అయితే, శిక్షకు గురైన ముగ్గురూ ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు ప్రత్యేక న్యాయస్థానం వీలు కల్పించింది.