: ఇలాకూడా జ్ఞాపకశక్తి పెరుగుతుందట!


జ్ఞాపకశక్తి పెరుగుదలకు రకరకాల మార్గాలను అనుసరిస్తుంటాము. అలాగే శారీరకంగా దృఢంగా ఉండడానికి వ్యాయామం చేస్తుంటాము. అలాకాకుండా ఒకే మార్గం రెండింటికి పరిష్కారం అయితే... శారీరక వ్యాయామమే మన ఆరోగ్యానికి, అలాగే జ్ఞాపకశక్తి వృద్ధికి కూడా ఉపకరిస్తే... శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో మనం శరీర ఆరోగ్యానికి చేసే శారీరక వ్యాయామం మన జ్ఞాపకశక్తి వృద్ధికి కూడా దోహదపడుతుందని తేలింది.

వ్యాయామం చేస్తున్న సమయంలో మెదడులో ఉత్పత్తి అయ్యే ఎఫ్‌ఎన్‌డీసీ5 అనే అణువు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింపజేయడానికి తోడ్పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. డానా-ఫార్బర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వ్యాయామం జ్ఞాపకశక్తి, విషయగ్రహణలో పాలుపంచుకునే జన్యువులను ప్రేరేపించే ఐరిసిన్‌ ప్రోటీన్‌ స్థాయిలను పెంచడంలో కూడా దోహదం చేస్తున్నట్టు గుర్తించారు.

ఈ ప్రోటీన్‌ స్థాయిలు నాడీ సంబంధ వ్యాధుల చికిత్సకు, వృద్దుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరచేందుకు మందులను రూపొందించడంలో కూడా ఉపయోగపడగలవని పరిశోధకులు భావిస్తున్నారు. వ్యాయామం విషయగ్రహణ శక్తిని పెంపొందించగలదని, పక్షవాతం కుంగుబాటు, అల్జీమర్స్‌ వంటి జబ్బుల లక్షణాలను తగ్గించగలదని తేలినప్పటికీ ఇదెలా జరుగుతుంది అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియడంలేదు. ఇందులో బీడీఎన్‌ఎఫ్‌ అనే వృద్ధి కారకం కీలక పాత్ర పోషిస్తుందని, వ్యాయామం చేయడం వల్ల మెదడులో ఎఫ్‌ఎన్‌డీసీ5, ఐరిసిన్‌ ఉత్పత్తితోబాటు బీడీఎన్‌ఎఫ్‌ వృద్ధి కారకం వ్యక్తీకరణ కూడా పెరిగినట్టు తేలింది.

  • Loading...

More Telugu News