: విభజనపై కేంద్ర మంత్రులకు శాఖల బాధ్యతలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా విధి విధానాల ఖరారు కోసం కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. కాగా, ఈ బృందంలోని మంత్రుల మధ్య శాఖాపరమైన బాధ్యతల విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించే క్రమంలో వివిధ శాఖల మధ్య పంపకాలు, ఇతరత్రా వ్యవహాలన్నింటినీ వీరు నిపుణుల సాయంతో ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజనపై ఢిల్లీలో ఈ రోజు తొలిసారి సమావేశమైన అనంతరం వెలువడిన ప్రకటనలో ఎవరెవరు ఏ బాధ్యతలు చూడబోయేదీ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి చిదంబరం.. ఆస్తులు, అప్పులు, ఆదాయ వనరుల వివరాలు చూస్తారు. హోం మంత్రి షిండే హైదరాబాద్, శాంతి భద్రతల అంశాలను నిర్ణయిస్తారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులు, నియోజకవర్గాల కేటాయింపు వ్యవహరాలను రక్షణ శాఖ మంత్రి ఆంటోని పర్యవేక్షిస్తారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీని నారాయణ స్వామి చూస్తారు.