: మతిమరుపును తరిమేయవచ్చు!
మతిమరుపు అనేది చాలామందికి పలురకాలుగా ఇబ్బందిని కలిగిస్తుంటుంది. కొందరికి ఇది వ్యాధిగా పరిణమిస్తుంది. అల్జీమర్స్, డిమెన్షియా, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు సోకినవారు అంతవరకూ గుర్తున్న విషయాలను మరచిపోతుంటారు. చివరికి కన్న బిడ్డలను కూడా మరచిపోతుంటారు. మెదడులోని కొన్ని కణాలు మరణించడం వల్ల ఈ వ్యాధులు వస్తుంటాయి. అలాకాకుండా మరణించిన కణాలను తిరిగి జీవించేలా చేస్తే అప్పుడు మతిమరుపు సమస్యను దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. ఈ నేపధ్యంలో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు విజయవంతం అయ్యాయి. మతిమరుపుకు కారణమయ్యే మరణించిన మెదడు కణాలను తిరిగి పునర్జీవింపజేసే ప్రత్యేక ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జియోవానా మలుకి నేతృత్వంలో కొందరు పరిశోధకుల బృందం ఒక సరికొత్త ఔషధాన్ని కనుగొన్నారు. ఈ ఔషధం మతిమరుపుకు చక్కటి మందుగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వీరు ఒక రసాయనిక మిశ్రమాన్ని ఎలుకలకు నోటిద్వారా ఇవ్వడం వల్ల వాటిలో మెదడు కణాలు చనిపోయే ప్రక్రియను ఆపడంలో విజయాన్ని సాధించారు. ఈ మందు మెదడు కణాలు మరణించడానికి దోహదం చేసే మార్గాన్ని విజయవంతంగా అడ్డుకుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ రసాయనిక మిశ్రమం ద్వారా అల్జీమర్స్, డిమెన్షియా, పార్కిన్సన్స్ వంటి జబ్బులను నయం చేయడానికి ప్రత్యేక ఔషధాలను తయారుచేయడానికి చక్కగా తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అల్జీమర్స్ నివారణకు, నియంత్రణకు తోడ్పడే మందుల రూపకల్పనకోసం జరుగుతున్న పరిశోధనలకు ఈ మందు కీలక మలుపుకు కారణం కాగలదని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ రోజర్ మోరిస్ చెబుతున్నారు.