: రిటైర్మెంట్ ప్రకటన చేసిన సచిన్!
భారత బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ఇప్పటికే టి20, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకున్న సచిన్ తన 200వ టెస్టు అనంతరం ఐదురోజుల క్రికెట్ నుంచి వైదొలుగుతానని తెలిపాడు. కెరీర్లో ఇప్పటివరకు 198 టెస్టులాడిన ఈ ముంబై వాలా 53.86 సగటుతో 15,837 పరుగులు చేశాడు. రికార్డు స్థాయిలో 51 సెంచరీలు, 67 అర్థసెంచరీలు నమోదు చేశాడు. ఈ నవంబర్లో విండీస్ జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత్ లో పర్యటించనుండగా, ఆ సిరీస్ లో చివరి టెస్టుతో మాస్టర్ ఆటకు వీడ్కోలు పలుకుతాడని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ, రిటైర్మెంట్ ఇప్పట్లో ఉండదని సచిన్ పేర్కొన్నాడు. అయితే, బీసీసీఐ సచిన్ కు సొంతగడ్డపై రిటైరయ్యే చాన్సు అందించడం కోసమే విండీస్ తో ఇప్పటికిప్పుడు సిరీస్ ను ఏర్పాటు చేసింది. దీనిపై సచిన్ కు బీసీసీఐతో భేదాభిప్రాయాలు తలెత్తినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సచినే స్వయంగా బీసీసీఐకి తన రిటైర్మెంటు విషయాన్ని చెప్పినట్టు సమాచారం.