: లగడపాటి 'రాజీనామా' పిటిషన్ పై విచారణకు కోర్టు అంగీకారం


తన రాజీనామాను ఆమోదించాలంటూ లోక్ సభ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? లేదా? అన్న వివరాలు తెలియజేయాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజీవ్ మెహ్రాను కోరింది. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తాను ఎంపీ పదవికి ఆగస్టు 2న రాజీనామా చేశానని, అయినా స్పీకర్ దాన్ని ఆమోదించడంలేదంటూ నిన్న లగడపాటి రాజగోపాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

దానిపై ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా లగడపాటి తరపున న్యాయవాది జయంత్ భూషణ్ వాదనలు వినిపించారు. రాజీనామా చేసిన తర్వాత కూడా పదవిలో కొనసాగేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదన్నారు. రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించాల్సిందేనని, కారణాల జోలికి వెళ్లకూడదన్నారు. రాజీనామాను ఆమోదించడం స్పీకర్ విశేషాధికారంలోకి వస్తుందని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? లేదా? అన్నది పరిశీలించాల్సి ఉందని చెబుతూ విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News