: మూత్రానికి, నేత్రానికి లింకుంది!
కంటికి వచ్చే ఒక వ్యాధిని మూత్ర పరీక్ష ద్వారా గుర్తించవచ్చట. శాస్త్రవేత్తలు మూత్ర పరీక్ష ద్వారా కంటికి వచ్చే వ్యాధిని గుర్తించవచ్చని చెబుతున్నారు. సాధారణంగా వారసత్వంగా కంటికి వచ్చే ఒక వ్యాధికి కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాన్ని మూత్ర పరీక్ష ద్వారా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా దృష్టిలోపం, అంధత్వ సమస్యలు తలెత్తుతాయి. వీటిని మూత్ర పరీక్ష ద్వారా ముందుగానే గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఫ్లోరిడాలోని బాస్కామ్ పామర్ నేత్ర కేంద్రానికి చెందిన పరిశోధకులు డాక్టర్ రాంగ్ వెన్, డాక్టర్ బైరాన్ ల్యామ్, డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన జిక్వియాంగ్ గువాన్‌తో కలిసి చేపట్టిన పరిశోధనల్లో వారసత్వంగా సంక్రమించే ఒక కంటివ్యాధికి కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాన్ని మూత్ర పరీక్షద్వారా గుర్తించవచ్చని తేల్చారు. వీరు తమ పరిశోధనల్లో భాగంగా రెటినైటిన్ పిగ్మెంటోసా (ఆర్‌పీ) అనే కంటివ్యాధితో బాధపడుతున్న కుటుంబం నుండి సేకరించిన కణాలను విశ్లేషించారు. ఈ కుటుంబానికి చెందిన జీనోమ్ సీక్వెన్స్‌ను అంతకుముందే పూర్తిచేసి వుండడంతో వాటితో వీటిని పోల్చిచూశారు. వీరు నిర్వహించిన మూత్ర పరీక్షలో రక్తపరీక్షలకన్నా కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని పరిశోధకులు చెబుతున్నారు. డోలికాల్ ప్రొఫైలింగ్‌లో మూత్ర పరీక్ష మంచి ఫలితాన్ని ఇస్తున్నట్టు పరిశోధకులు స్పష్టం చేశారు.