: ఈ అరుదైన తివాచీ మనప్రతిభే!
ప్రాచీన కాలం నుండి మన దేశంలో చక్కటి నాణ్యమైన తివాచీలను తయారుచేసేవారు. ఇలాంటి పాతకాలం నాటి తివాచీని వేలానికి వేస్తే వేలుకాదు... కోట్ల రూపాయల ధరను అది సొంతం చేసుకుంది. ఎంత అంటే అక్షరాల్లో నలభైఆరు కోట్ల రూపాయలు. అంత ధర పలకడానికి అదేమన్నా బంగారు తివాచీనా అనుకుంటే అదేంకాదు... మామూలు తివాచీనే! అయితే, అది తయారైన కాలాన్ని, దాని పని నైపుణ్యాన్ని, నాణ్యతనుబట్టి దానికి అంత ధర పలికింది.
లండన్లోని క్రిస్టీస్ అనే సంస్థ ఒక అరుదైన తివాచీని వేలం వేసింది. ఈ తివాచీ మొఘలుల కాలం నాటి తివాచీ. దీన్ని సుమారు 300 సంవత్సరాల క్రితం శ్రీనగర్లో రూపొందించారని అంచనా. ఈ తివాచీని వేలం వేయగా అది రూ.46.46 కోట్లు అంటే 47 లక్షల పౌండ్ల ధర పలికిందట. ఇంత ధర పెట్టి కొన్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో... తెలియడంలేదు. అయినా ఒక తివాచీని ఇంత ధర పెట్టి కొనడం అంటే మామూలు విషయం కాదు. అందుకే వెర్రి వేయివిధాలు అంటారు!