: కంఠంలో ప్రాణమున్నంత వరకు పోరాడతా: చంద్రబాబు


తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ తెలుగు జాతి కోసం పోరాడతానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లోని దీక్షాశిబిరంలో మాట్లాడుతూ, న్యాయం జరిగే వరకూ తాను ఏపీ భవన్ నుంచి కదిలేది లేదని అన్నారు. తనపై కక్షతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే తాను ఢిల్లీలో దీక్ష చేపట్టానని చెప్పారు. తాను ఎప్పుడో రాసిన లేఖను ఇప్పుడు విడుదల చేశారని ఆయన ఆరోపించారు. ఒక ఇంట్లో సంతానం విడిపోవాలంటే సమన్యాయం చేస్తూ గ్రామ పెద్దలు తీర్పు చెబుతారని, అంతే కానీ, ప్రక్క గ్రామం నుంచి వచ్చిన వారు తీర్పు చెప్పరని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పెద్ద కూడా లేడని భావిస్తున్నారా? అని బాబు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ గతంలో విపీ సింగ్ ను ప్రధానిని చేస్తే తాను ఎన్డీయేను అధికారంలోకి తెచ్చానని గుర్తు చేశారు. తాను ధర్మం, న్యాయం కోసం దీక్ష చేస్తున్నానని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఓట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్.. వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ లను విలీనం చేసుకునే కుట్రకు తెరతీసిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా తెలివిలేకుండా పనిచేస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్ఠానం దోషులైన రాజకీయ నాయకులపై కేసుల మాఫీకి ప్రయత్నించి వారిని తమతో కలుపుకుని రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. అదేమన్నా మంచి సంప్రదాయమా? అని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ప్రత్యర్థి పార్టీలను లొంగదీసుకుని నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఏపీ భవన్లో తెలుగు వారికే నీడ లేకుండా చేస్తున్నారన్న బాబు, తానేం తప్పు చేశానని ఇక్కడి నుంచి వెళ్లగొడుతున్నారని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా పని చేసి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నానని అలాంటి తాను ఏపీభవన్లో ఉండడానికి అర్హుడిని కానా? అని నిలదీశారు. విభజన సమస్య ప్రారంభమైన ఢిల్లీలోనే ఆ సమస్యకు ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు.

'రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించి, ప్రజలు నిరసన చేస్తుంటే న్యాయం చేయమంటున్నాం.. అది తప్పా?' అని ఆయన ప్రశ్నించారు. తెలుగువారిపై వివక్షకు వ్యతిరేకంగా తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ తమను అనాథరైజ్డ్ వ్యక్తులని అంటున్నాడని, తెలుగువారికి ఏపీ భవనే అడ్రస్ అనే విషయం ఆయన తెలుసుకోవాలని బాబు సూచించారు. తెలుగువాడైన పీవీ నరసింహారావు దేశానికి దశ, దిశ నిర్ధేశిస్తే ఆయన స్మృత్యర్ధం ఢిల్లీలో ఆయన పేరిట ఒక ఘాట్ కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆయన శవాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాలనివ్వలేదని మండిపడ్డారు.

'సోనియా కు ఇష్టముంటే జగన్ కు బెయిలిస్తారు, తద్వారా దేశాన్ని నాశనం చేస్తారు' అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై కక్ష తీర్చుకున్నా పర్వాలేదనీ, తెలుగు జాతిమీద మాత్రం ద్వేషం ప్రదర్శించవద్దని ఆయన సోనియాగాంధీకి సూచించారు. తన పోరాటం తెలుగు జాతికోసమని ఆయన స్పష్టం చేశారు. ఓట్లు, సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని శ్మశానం చేసి అధికారం కోసం తప్పుడు రాజకీయాలు చేస్తున్నారన్న బాబు కాంగ్రెస్ పార్టీ తమను పెట్టే ఇబ్బందుల్ని దేశం గమనిస్తోందని చెప్పారు. న్యాయం జరిగే వరకూ తాను పోరాడతానని, ఇక్కడి నుంచి కదిలేది కానీ, దీక్ష విరమించేది కానీ లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News