: సమ్మె కొనసాగించాలని ఏపీఎన్జీవోల నిర్ణయం, సీఎంతో చర్చలు విఫలం
సమ్మెను విరమించం... కొనసాగిస్తామని ఏపీఎన్జీవోలు తేల్చిచెప్పేశారు. ముఖ్యమంత్రితో ఏపీఎన్జీవోల చర్చలు దాదాపు మూడున్నర గంటల పాటు సాగినా... సమ్మె విరమణపై ఏపీఎన్జీవోలు దిగిరాలేదు. ప్రజల శ్రేయస్సు కోసం సమ్మెను విరమించాలని ఉద్యోగులను ముఖ్యమంత్రి కిరణ్, మంత్రులు కోరారు. చర్చల సందర్భంగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రభుత్వం తరపున ఎలాంటి హామీ ఇవ్వగలరని సీఎంను అడిగినట్టు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. దీనికి సమాధానంగా, తాను సీఎంగా ఉన్నంత కాలం రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని కిరణ్ చెప్పారని అశోక్ బాబు తెలిపారు.
అసెంబ్లీకి విభజన తీర్మానం రెండు సార్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారని సీఎం తెలిపినట్టు అశోక్ బాబు చెప్పారు. ఒకసారి అభిప్రాయ సేకరణ కోసం, మరోసారి తీర్మానం కోసం రెండు సార్లు వస్తుందని అన్నట్టు చెప్పారన్నారు. ఆ సమయంలో అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించేందుకు కృషి చేస్తామని సీఎం తమకు హామీ ఇచ్చారని అన్నారు. అయితే దీనికి ఉద్యోగ సంఘాల నేతలు ససేమిరా అన్నారని తెలిపారు. సమైక్యవాదిగా ముఖ్యమంత్రిని గౌరవిస్తామని... కానీ ఆయనొక్కరే ఏమీ చేయలేరని ఏపీఎన్జీవోలు తెలిపారు. అన్ని పార్టీలు సమైక్యంగా పోరాటం చేయాలని... కలసి తీర్మానాన్ని ఓడించాలని వారు డిమాండ్ చేశారు.
తుపాను వచ్చే అవకాశం ఉందని.. సమ్మెను విరమించాలని సీఎం కోరినట్టు అశోక్ బాబు తెలిపారు. దీనికి సమాధానంగా ఒక వేళ తుపాను వస్తే, సమ్మెలో ఉంటూనే సహాయక చర్యల్లో పాల్గొంటామని తెలిపామని అన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి షిండే స్పందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దలు రోజుకోమాట మాట్లాడుతున్నారని అశోక్ బాబు విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం పంపనున్న కమిటీలో ఒక్క తెలుగువాడు కూడా లేకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తమకు స్పష్టమైన హామీ వస్తేనే సమ్మెను విరమిస్తామని... అంతవరకు సమ్మెను ఆపే ప్రసక్తే లేదని అశోక్ బాబు తేల్చి చెప్పారు