: తొలిసారిగా మహిళకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పగ్గాలు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్(సెంట్రల్ బ్యాంకు) పగ్గాలు తొలిసారిగా ఒక మహిళ చేపట్టనుంది. ప్రస్తుతం చైర్మన్ గా బెన్ బెర్నాంకే ఉన్నారు. ఫెడ్ వైస్ చైర్మన్ గా ఉన్న జానెత్ యెల్లెన్ ను బెర్నాంకే వారసురాలిగా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేయనున్నారు. బెర్నాంకే, యెల్లెన్ ఈ రోజు ఒబామాను కలవనున్నారని, అనంతరం చైర్ పర్సన్ గా యెల్లెన్ నియామకానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
మనదేశంలో రిజర్వ్ బ్యాంకు వలే అమెరికాలోనూ ఫెడరల్ రిజర్వ్ కేంద్ర బ్యాంకుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఫెడ్ చైర్మన్ గా ఉన్న బెర్నాంకే పదవీ కాలం జనవరితో ముగియనుంది. ఎనిమిదేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న బెర్నాంకే ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా బయటపడేందుకు తన వంతు కీలక పాత్ర పోషించారు.