: 'విడాకులు' తీసుకున్న 'వాల్ మార్ట్ - భారతి'
తమ దీర్ఘకాల వ్యాపార అనుబంధానికి అమెరికాకు చెందిన వాల్ మార్ట్, భారత్ కు చెందిన భారతీ ఎంటర్ ప్రైజెస్ ముగింపు పలికాయి. ఇకపై ఇరు కంపెనీలు సొంతంగానే వ్యాపారం నిర్వహించనున్నట్లు ఈ రోజు సంయుక్తంగా ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం 2010లో సింగిల్ బ్రాండ్ రిటైల్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడంతో ప్రపంచ రిటైల్ దిగ్గజంగా ఉన్న వాల్ మార్ట్ భారత్ లోకి ప్రవేశించింది. భారత్ లో రిటైల్ వ్యాపారం కోసం సునీల్ మిట్టల్ కు చెందిన భారతీ ఎంటర్ ప్రైజెస్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండూ కలిసి భారతీ వాల్ మార్ట్ ప్రైవేటు లిమిటెడ్ ను ఏర్పాటు చేశాయి.
ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 20 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. రెండు కంపెనీలు తమ భాగస్వామ్యానికి ముగింపు పలకడంతో భారతీ వాల్ మార్ట్ కంపెనీలో భారతీ ఎంటర్ ప్రైజెస్ కు ఉన్న 50 శాతం వాటాను వాల్ మార్ట్ కొనుగోలు చేస్తుంది. బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకంలోనూ విదేశీ కంపెనీలను అనుమతిస్తూ కేంద్రం గతేడాది నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాల్ మార్ట్ భారత రిటైల్ మార్కెట్లో దూకుడుగా వెళ్లడానికి ప్రస్తుత నిర్ణయం దోహదపడగలదు.