: మనం ఎంతకాలం బతుకుతామంటే...
మన జీవిత కాలం ఎంత...? ఇంకా ఎంతకాలం బతుకుతాం...? ఎప్పుడు మనకు మరణం ఆసన్నమవుతుంది...? ఈ ప్రశ్నలకు ఎవరైనా సమాధానాలు చెప్పగలరా...? ఎవరూ చెప్పలేరు. మనిషి ఎప్పుడు చనిపోతాడు, ఇంకా ఎంతకాలం బతుకుతాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలను చెప్పడం కష్టం. అయితే ఒక వాచీ మనం ఎంతకాలం బతుకుతామో చెప్పేస్తుందట. అదికూడా గంటలు, నిమిషాలతో సహా చెప్పేస్తుందట. ఇలాంటి వాచీని స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ డిజిటిటల్ వాచీ ఒక ప్రశ్నావళి ఇస్తుందట. దాన్ని పూరించిన తర్వాత మనం ఎంతకాలం బతుకుతాం... మన జీవితకాలం ఇంకా ఎంత మిగిలివుంది? వంటి వివరాలను ఈ వాచీ ఇట్టే లెక్కగట్టి చెప్పేస్తుందట.
స్వీడన్‌కు చెందిన ఫెడ్రిక్ కోల్టింగ్ అనే శాస్త్రవేత్త టిక్కర్ అనే ఒక డిజిటల్ వాచీని తయారుచేశారు. ఈ వాచీలో మనకు సంబంధించిన ఆరోగ్యపరిస్థితి, వయసు వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా ఈ వాచీ మనం ఇంకా ఎంతకాలం బతుకుతాము? అనే విషయాన్ని చూపిస్తుందట. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, గంటలు, నిమిషాలు, సెకన్లతో సహా ఇది లెక్కేసి చెప్పేస్తుందట. మన శేష జీవితానికి సంబంధించిన టైమర్లాగా ఇది పనిచేస్తుందట.
జీవితంలో ఎంతో విలువైన మన సమయాన్ని మనం వృధా చేస్తుంటాము. ఇలా సమయాన్ని వృధా చేయడాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఫెడ్రిక్ ఈ వాచీని తయారు చేసినట్టు చెబుతున్నాడు. మనకు ఇంకా ఎంత జీవితం మిగిలివుంది అనే విషయం తెలిస్తే, మిగిలివున్న జీవితంలో ఏవైనా పనులు చేయకుండా మిగిలివుంటే వాటిని వెంటనే పూర్తి చేసుకోవడానికి వీలవుతుందని ఫెడ్రిక్ చెబుతున్నాడు.