: తొడగొట్టిన విజయనగరం మహిళలు
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు కష్టకాలం నడుస్తోంది! విభజనను బొత్స సమర్థిస్తున్నారంటూ గత రెండ్రోజులుగా విజయనగరంలో ఆయన ఆస్తులను సమైక్యవాదులు లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. విజయనగరం పట్టణంలో ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉండగా.. బొంకులదిబ్బ వద్ద పండ్లు, కూరగాయలు అమ్ముకునే మహిళలను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు ఆదేశించారు. దీంతో, రెచ్చిపోయిన ఆ మహిళలు దీనికంతటికీ కారణం బొత్సేనని మండిపడ్డారు. బొత్సకు మీసం, రోషం ఏమాత్రంలేవని దుయ్యబట్టారు. అంతేగాకుండా, బొత్స విజయనగరం వస్తే తమ తడాఖా చూపుతామని తొడకొట్టి మరీ సవాల్ విసిరారు. పదవుల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సై అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.