: చిట్టి తరహా రోబోలు వస్తున్నాయి!
రోబోలు అంటే మన చేతిలో తయారై, మనం చెప్పిన పనులను చేసేవిగా మాత్రమే మనకు తెలుసు. అలా కాకుండా మనచేతిలో తయారైన రోబోలు తమకు తామే ఒక రోబోగా నిర్మాణం చేసుకుంటే.. వెరైటీ! రోబో సినిమాలో చిట్టి రోబో తనకుతానే బోలెడంతమంది రోబోలను తయారు చేసేసి, తర్వాత ఇవన్నీ కలిసి ఒక కొత్త ఆకారంగా తయారవుతాయి చూడండి అలాగన్నమాట. ఇలాంటి ఒక కొత్తరకం రోబోలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ రోబోలు అవసరమైన సమయాల్లో తమకు తామే ఒక సరికొత్త రోబోగా నిర్మాణమై పనులను చేసిపెడతాయట.
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు స్వయంగా ఎగరగలిగేలా, పరిస్థితికి అనుగుణంగా తగిన ఆకారాన్ని మార్చుకునే ఘనాకారంలో ఉండే రోబోలను అభివృద్ధి చేశారు. ఈ రోబోలు అవసరానికి తగిన విధంగా తమ ఆకారాన్ని మార్చుకోగలవట. ఈ కొత్తరకం రోబోలు అత్యవసర సమయాల్లో భవనాలు, వంతెనలకు మరమ్మత్తులు చేయగలవని పరిశోధకులు భావిస్తున్నారు. ఇవి ఒకదానికి మరొకటి అనుసంధానమై తమంతగా తామే ఒకే రోబోగా నిర్మాణమై పనిచేస్తాయట. అచ్చు రోబో సినిమాలో రోబోలంతా కలిసి కొత్త ఆకారంలో తయారవుతాయి... అలాగన్న మాట. మొత్తానికి ఈ రోబో చిట్టి తరహాలో పనిచేస్తుందన్నమాట.