: ఎంపీలు మోసగించారు, కనీసం ఎమ్మెల్యేలైనా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి : అశోక్ బాబు


ఎంపీలు ప్రజలను మోసం చేశారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఘాటుగా విమర్శించారు. కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లో ఏపీఎన్జీవోల సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు మేం రాజీనామా చేయమన్నప్పుడు చేయకుండా... ఏదో సాధిస్తామని కబుర్లు చెప్పారని అన్నారు. కానీ, ఇప్పుడు ఏమీ చేయలేక తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కనీసం ప్రజలకు దగ్గర్లో ఉన్న ఎమ్మెల్యేలైనా తమ వంతు ప్రయత్నాలను చిత్తశుద్ధితో చేయాలని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తామని సీమాంధ్ర ఎమ్మెల్యేలు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేలు వినియోగించుకోకపోతే మొత్తం రాజకీయ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోతుందని హెచ్చరించారు.

ఈనెల 20 వ తేదీ వరకు సమ్మెను కొనసాగిస్తామని అశోక్ బాబు తెలిపారు. రానున్న రోజుల్లో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీన సీమాంధ్రలోని అన్ని మండలాల్లో రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఈనెల 8, 9, 17, 18, 19 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను అడ్డుకుంటామని తెలిపారు. దీనికి తోడు 10, 11, 12 తేదీల్లో సీమాంధ్రలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని అన్నారు.

విద్యుత్ ఉద్యోగుల చేస్తున్న సమ్మెకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలోని ఉద్యోగస్తులెవరూ దసరా పండుగను జరుపుకోకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. తమతో కేవలం ముఖ్యమంత్రి స్థాయిలోనే చర్చించాలని ఆయన అన్నారు.

విజయనగరంలో ఉపాధ్యాయులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్టు అశోక్ బాబు తెలిపారు. దీనికితోడు, రాజమండ్రిలో ఏపీఎన్జీవోలపై దాడిచేసిన ఎంపీ హర్షకుమార్ కుమారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమంలోకి రాజకీయ నాయకులను ఎంతమాత్రం అనుమతించమని తెలిపారు.

  • Loading...

More Telugu News