: ప్రజాప్రతినిధుల నేరం రుజువైతే అనర్హతే: సుప్రీంకోర్టు


దోషులుగా తేలిన ప్రజా ప్రతినిధులను శిక్షా కాలంతో సంబంధం లేకుండా తక్షణం చట్టసభల నుంచి గెంటివేసేందుకు వీలుగా సుప్రీంకోర్టు లోగడ తానిచ్చిన తీర్పును సవరించింది. క్రిమినల్ కేసుల్లో రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులు తమ పదవులకు అనర్హులంటూ సుప్రీంకోర్టు జూలై 10న తీర్పు చెప్పింది. ఈ తీర్పును కాలరాస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించేందుకు బిల్లు, తర్వాత ఆర్డినెన్స్ ను తీసుకురావాలని చూసి విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

శిక్షా కాలంతో సంబంధం లేకుండా దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులను పదవులకు అనర్హులుగా ప్రకటించింది. దీంతో దాణా కుంభకోణంలో ఇటీవలే దోషిగా తేలిన లాలూ తన ఎంపీ పదవిని కోల్పోవడంతోపాటు, ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోనున్నారు. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం దోష ప్రజాప్రతినిధులుగా తేలిన వారి గురించి ప్రభుత్వం లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కు తెలియజేస్తుంది. వారు ఎన్నికల కమిషన్ కు తెలియజేస్తారు. దీంతో వారిపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News