: రాజీనామాపై వెనక్కి తగ్గిన కేంద్ర మంత్రి పళ్లంరాజు
రాజీనామాలపై హైడ్రామా నడుస్తోన్న ఈ సమయంలో కేంద్రమంత్రి పళ్లంరాజు తన రాజీనామాపై వెనక్కు తగ్గారు. కొంతసేపటి క్రితమే ఆయన సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను రాజీనామా చేయరాదని సోనియా సూచించారని తెలిపారు. మొన్నటి కేబినేట్ భేటీ తర్వాత సీమాంధ్రలో తలెత్తిన ఆందోళనలను సోనియా దృష్టికి తీసుకెళ్లినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే త్వరలోనే కేంద్ర మంత్రుల బృందం సీమాంధ్ర ప్రాంత సమస్యలను గుర్తించడానికి రాష్ట్రంలో పర్యటిస్తుందని... తనను కూడా ఆ బృందంలో ఒక సభ్యుడిగా ఉండాలని సోనియా సూచించినట్టు పళ్లంరాజు తెలిపారు. మంత్రుల బృందంలో పనిచేయడం ద్వారా సీమాంధ్రుల ఆకాంక్షను నెరవేర్చవచ్చని సోనియా అన్నట్టు వెల్లడించారు. కాగా, ఈ కారణంగానే రాజీనామా వ్యవహారంలో పళ్లంరాజు మెత్తబడ్డట్టు తెలుస్తోంది.