: భర్త మరణించిన యాభై సంవత్సరాలకు పెన్షన్


భర్త మరణించాక స్త్రీకి కుటుంబ పోషణ భారమవుతుందనేది వాస్తవం. ఏదైనా ఆర్ధిక సహకారం అందితే ఫరవాలేదు. కానీ, ఎలాంటి ఆసరా లభించకపోతే మాత్రం ఆ మహిళ జీవితం కష్టాల సుడిగుండంలో చిక్కుకోకతప్పదు. ఈ నేపథ్యంలో ఒడిశాలో ఓ మహిళ తన భర్త మరణించిన యాభై సంవత్సరాలకు పెన్షన్ పొందింది. భువనేశ్వర్లో నివసించే హరిప్రియ దేవి, జానకి నంద చౌదరి దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 1950లలో జానకి నంద భువనేశ్వర్ బీజేబీ కళాశాలలో ఆంగ్ల విభాగంలో లెక్చరర్ గా పనిచేసేవాడు. అయితే, 1962లో అకస్మాత్తుగా 29 సంవత్సరాల వయసులోనే ఆయన మరణించాడు.

ఆ సమయంలో భార్య హరిప్రియ దేవి వయసు 26 సంవత్సరాలు. తర్వాత ఆమె ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించింది. అప్పుడే భర్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈలోపు ఆమె కూడా రిటైర్ అయింది. ఈ మధ్యలో చాలాసార్లు అధికారుల వద్దకు వెళ్లి అనేకసార్లు మొరపెట్టుకున్నా లాభంలేకపోయింది. పెన్షన్ కోసం ప్రతి ఏడాది ఉన్నతాధికారులను కూడా కలిసేది. అయితే, నిబంధనల ప్రకారం ఆమె భర్త పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకోలేదని, దానివల్ల కుటుంబ పెన్షన్ పథకానికి అర్హత లేదన్నారు.

దాంతో, ఒడిశా ప్రభుత్వానికి ఆమె అనేకసార్లు లేఖలు రాసింది. 1964 జనవరికి ముందు ప్రభుత్వ ఉద్యోగాలు చేసినవారు మరణించినా, రిటైర్ అయినా గెజిట్ నోటిఫికేషన్ నం-68/86 ప్రకారం పెన్షన్ పొందే అర్హత ఉందని పలుమార్లు తన లేఖల్లో వాదించింది. చివరిగా ఆమె వాదనను ఆమోదించిన అధికారులు నెలకు ఆరువేల రూపాయల (భర్త జీతం రూ.340 ప్రకారం) పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారు. అంతేగాక ఆమెకు రావల్సిన బకాయిల మొత్తం రూ.6.7 లక్షలు ఇచ్చేందుకు సర్కారు ఆమోదించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికైనా తనకు పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించడం సంతోషంగా ఉందని హరిప్రియ తెలిపింది.

  • Loading...

More Telugu News