: ఇలా బరువు తగ్గడం సాధ్యమేనట
అధిక బరువును తగ్గించుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదని బాధపడేవారు కూడా మనకు కనిపిస్తుంటారు. అయితే చక్కటి నడకతో మన బరువును తగ్గించుకోవచ్చట. శరీరంలోని అదనపు కేలరీలను ఖర్చు చేయడానికి నడకే మంచి సాధనమని పరిశోధకులు చెబుతున్నారు.
చాలా కాలంగా ఎలాంటి వ్యాయామం చేయకుండా ఉండి, ఒక్కసారిగా ఏదైనా శారీరక వ్యాయామం చేద్దామని, దాని ద్వారా బరువు తగ్గుదామని మీరు గనుక భావిస్తే దానికి చక్కటి తరుణోపాయం రోజూ ఒక అరగంట పాటు నడవడమే. ఇలా అరగంటతో ప్రారంభించి క్రమేపీ ఎక్కువసేపు నడవడం చేస్తుంటే క్రమేపీ మీ బరువును తగ్గించుకోవచ్చట. కొందరికి ఇలా ఒంటరిగా నడవడం అనేది విసుగేస్తుంది. ఇలాంటి వారు చక్కగా కొంతమందితో కలిసి నడవడం చేస్తే విసుగు లేకుండా ఉంటుంది. లేదా చక్కటి పాటలను వింటూ వాకింగ్ చేయండి. మీరు గనుక జిమ్లో ఈ పనిచేసేట్లయితే చక్కగా టివి చూస్తూ కూడా చేయవచ్చు. దీంతో మీరు బోర్ ఫీలయ్యే అవకాశం ఉండదు. ఒకపక్క చక్కటి ఎంటర్టైన్మెంటు పొందుతూ, మరోవైపు చక్కటి ఎక్సర్సైజ్ చేయడం సాధ్యమవుతుంది.
అయితే వాకింగ్ చేసే సమయంలో చక్కటి షూస్ వేసుకోవాలి. కాళ్లకు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా చూసుకోవాలి. మంచి షూస్ వేసుకోవడం వల్ల కీళ్లపై ఎక్కువ వత్తిడి లేకుండా ఉంటుంది. అలాగే రోజూ అరగంటపాటు వాకింగ్ చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంతోబాటు షుగరు, గుండెకు సంబంధించిన పలు సమస్యలను తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు, 65 కేజీల బరువుండే వ్యక్తి రోజుకు 6.5 కిలోమీటర్ల దూరం నడవడం వల్ల గంటకు 362 కేలరీలను ఖర్చు చేయగలుగుతారట. ఉదర భాగంలోను, తొడల భాగంలోను ఉన్న కొవ్వును కరగించడానికి వాకింగ్ చక్కగా ఉపయోగపడుతుందట. కాబట్టి చక్కగా రోజూ అరగంటపాటు నడిచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.