: సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడుతాం: సుష్మా స్వరాజ్


సీమాంధ్ర ప్రాంతం అంటే వ్యతిరేకత కానీ, ఆ ప్రాంతాన్ని వదులుకోవాలన్న ఉద్దేశ్యం కానీ తమకు లేదని బీజేపీ నాయకురాలు, లోక్‌సభలో ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. సుష్మా స్వరాజ్ ను ఈ రోజు కంభంపాటి హరిబాబు నేతృత్వంలోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుల బృందం ఆమె నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో రెండు నెలలుగా జరుగుతున్న ఉద్యమం, ప్రజల ఇబ్బందులు, వారి ఆందోళనలను ఆమెకు ఈ బృందం వివరించింది.

దీనికి ఆమె స్పందిస్తూ, సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా బీజేపీ, తాను వ్యక్తిగతంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రతి దశలోనూ సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నిస్తానని, ఈ మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆమె తెలిపారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలు, వాటి పరిష్కారాలపై ప్రధానమంత్రిని కూడా కలుద్దామని ఆమె ఈ బృందానికి ప్రతిపాదించారు. తాను ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుంటానని, కాబట్టి అప్పుడు మళ్లీ ఢిల్లీ రావాలని ఆమె కోరారు.

ఒక ప్రాంతంపై ప్రేమ చూపిస్తూ మరొక ప్రాంతాన్ని అన్యాయం చేసే ఉద్దేశ్యం జాతీయ పార్టీ అయిన బీజేపీకి లేదని ఆమె స్పష్టం చేశారు. తనకు సీమాంధ్ర ప్రాంతం కూడా ముఖ్యమేనని, ఆ ప్రాంతంలో కూడా బీజేపీ అభివృద్ధి చెందాలనే తాను కోరుకుంటున్నాని అన్నారు. సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా తనవంతు కృషి చేస్తానని తనను కలిసిన బృందానికి ఆమె హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News