: ముఖ్యమంత్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 32 మంది ప్రజాప్రతినిధుల రాజీనామా
తెలంగాణకు అనుకూలంగా కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడంతో ఏకంగా 32 మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సంఘటన ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోని బంగారుపాళ్యం మండలంలో జరిగింది. మండలంలోని జెడ్పీ మాజీ ఛైర్మన్ కుమార్ రాజ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సాగర్ రెడ్డితో పాటు మండలంలోని 12 మంది సర్పంచులు, 18 మంది మాజీ ఎంపీటీసీలు పార్టీ సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర కోసం పోరాడే వారికే రానున్న ఎన్నికలలో తాము మద్దతు పలుకుతామని తెలిపారు. వీరందరి రాజీనామాతో బంగారుపాళ్యం మండలంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టయింది.