: అధికారం చేతిలో ఉందని.. నచ్చినట్టు చేస్తారా? : జగన్
అధికారం తమ చేతుల్లోనే ఉందని చెప్పి, ఆరువారాల్లో విభజన చేస్తామంటున్నారని జగన్ కాంగ్రెస్ వ్యవహార శైలిని విమర్శించారు. 'గతంలో మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ విషయంలో అసెంబ్లీ అనుమతి లేకుండానే నిర్ణయం తీసుకున్నారా?' అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఎందుకు విభజిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సాంకేతిక ప్రక్రియ లేకుండా అందరి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 60 ఏళ్లుగా కలిసి ఉన్న ప్రజలను ఎలా విభజిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలతో నీటి కోసం రోజూ కొట్టుకొనే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
'కర్నూలు, నల్గొండ, ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో నీటి గురించి ప్రజలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ట్రైబ్యునల్స్ ఉన్నా ఏం ప్రయోజనం లేద'ని జగన్ అన్నారు. ట్రైబ్యునల్స్ నిజంగా పనిచేస్తే... కావేరి జలాల కోసం కర్ణాటక, తమిళనాడు ఈ నాటికీ ఎందుకు గొడవపడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఆల్మట్టి, నారాయణ్ పూర్ నిండితే కానీ మనకు నీరు వదలని పరిస్థితి ఎందుకు నెలకొనేదని అన్నారు.
ఉన్న రాష్ట్రాలతోనే సరిపోక మరో రాష్ట్రాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గోదావరి నీటిని మహారాష్ట్ర అక్రమంగా వాడుకుంటున్నా ట్రైబ్యునల్స్ దాన్ని అడ్డుకుంటున్నాయా? అని నిలదీశారు. ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను 60 ఏళ్ల నుంచి నిర్మిస్తున్నారని, అలాంటిది ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాన్ని పదేళ్లలో ఎలా నిర్మిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. విద్యావంతులైన మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడకి వెళ్లాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ అంటే అంత చులకనగా కనపడుతోందా?' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.