: అతిలేకుండా మితంగా ఉంటే మేలేనట!


ఏదైనా మితంగా ఉండాలి... అతిగా ఎప్పుడూ చేయకూడదు. అతి ఆహారమైనా... లేదా విశ్రాంతి అయినా... మరేదైనా కూడా పరిమితికి అనుగుణంగా ఉండాలేగానీ మితిమీరి ఉండకూడదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు శాస్త్రవేత్తలు నిద్రపై తాజా అధ్యయనాన్ని నిర్వహించి నిద్ర ఎక్కువైనా, తక్కువైనా కూడా ఇబ్బందేనని తేల్చారు. రోజుకు ఆరుగంటలకన్నా తక్కువసేపు నిద్రపోయినా, లేదా పదిగంటలకు మించి నిద్ర పోయినా కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఆరుగంటలకన్నా కూడా తక్కువ సేపు నిద్ర పోయిన వారిలో గుండె సంబంధమైన ఇబ్బందులు, గుండెపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు వివరించారు. అలాగే అధిక సమయం నిద్ర పోయేవారు కూడా పలు రకాలైన గుండెజబ్బులు, మధుమేహం, ఆదుర్దా, అనవసరమైన భయాందోళనలు, స్థూలకాయం వంటి సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు 45 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయట. అందుకే దీర్ఘకాలంగా మధుమేహం, ఇతర గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి వైద్యం చేసే విషయంలో వైద్యులు వారి నిద్ర వేళలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు 45 ఏళ్లకు పైబడిన సుమారు 54 వేలమందిపై పరిశోధన చేసి ఈ ఫలితాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News