: ఒత్తిడితో మతి భ్రమిస్తుందట!


మహిళల్లో ఒత్తిడి కారణంగా భవిష్యత్తులో డిమెన్షియా, లేదా అల్జీమర్స్‌ తరహా వ్యాధుల బారిన పడే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా మహిళల్లో మనోబలం ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా తట్టుకోలేని సంఘటనలు జరిగినప్పుడు వారిలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఈ కారణంగా భవిష్యత్తులో వారు డిమెన్షియా బారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. మహిళలు విడాకులు తీసుకోవడం, భర్తను కోల్పోవడం, ఉద్యోగం పోగొట్టుకోవడం వంటి సంఘటనల కారణంగా వారు మానసికంగా ఒత్తిడికి లోనుకావడం వల్ల తర్వాత కాలంలో వారు డిమెన్షియా బారిన పడతారని ఈ అధ్యయనంలో తేలింది.

స్వీడన్‌లో సుమారు 800 మంది మహిళలపై చేపట్టిన అధ్యయనంలో మధ్యవయసులో ఇలాంటి ఒత్తిడికి గురైన వారిలో తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో డిమెన్షియా, అల్జీమర్స్‌ వంటి మానసికపరమైన సమస్యలు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. మానసికంగా ఒత్తిడికి గురయ్యే మహిళల్లో కుంగుబాటు, ఆందోళన, భయం, ఉద్రేకం, నిద్రలేమి వంటి సమస్యలు ఇతర ఆరోగ్యపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికి ఇతర కారణాలు కూడా తోడయ్యే అవకాశం ఉందని, మానసికపరమైన ఒత్తిడికి, మెదడులో ఇన్‌ఫ్లమేటరీ కారకాల ఉత్పత్తి పెరిగేందుకు సంబంధం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి ఒత్తిడి కారణంగా గుండెజబ్బు ముప్పు కూడా పెరుగుతుందని, ఇవన్నీ కలిపి డిమెన్షియా ముప్పును పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News