: రాష్ట్రానికి 'ఎన్టీఆర్.. వైఎస్' అవసరం: మంత్రి డొక్కా
ప్రస్తుతం రాష్ట్రంలో సమస్యలు చక్కదిద్దాలంటే ఎన్టీఆరో, వైఎస్సో తప్పకుండా అవసరమని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. అప్పుడే సమస్యలు ఓ కొలిక్కి వస్తాయన్నారు. విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న సీఎం కిరణ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. సీఎం వ్యాఖ్యలు తనకు ఆందోళన కలిగించాయన్నారు. ఇష్టం లేకపోయినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, అంతేకాని అధిష్ఠానాన్ని సీఎం బహిరంగంగా వ్యతిరేకించడం తప్పని సూచించారు. 'సీఎం తీసుకునే కొన్ని నిర్ణయాలు మాకు నచ్చవు.. అలాగని మేము వ్యతిరేకించడం లేదు కదా?' అని ప్రశ్నించారు.
కిరణ్ పొగడ్తలకు అలవాటు పడ్డారన్న డొక్కా, ఓ భజన బృందం ఆయన పక్కన చేరి చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను ముక్కుసూటిగా వ్యవహరిస్తాననే తనను కిరణ్ పరిగణనలోకి తీసుకోవడంలేదన్నారు. మాజీ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావులు తన నిర్ణయాన్ని వినడంలేదనే వారిని తప్పించారని డొక్కా గుర్తు చేశారు. సీమాంధ్ర నేతల నుంచి కొత్త పార్టీ వస్తుందన్న వార్తలపై ఇదే సమయంలో స్పందించిన మంత్రి.. ప్రత్యేక పార్టీ అనేదేలేదన్నారు. ముఖ్యమంత్రి, వాళ్ల తండ్రిగారు, అందరూ కాంగ్రెస్ లో వారేనని.. కాంగ్రెస్ ఈ రోజు కిరణ్ కు పదవి కట్టబెట్టిందని, అలాంటప్పుడు సీఎం పార్టీని విడిచివెళ్లే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తన జిల్లా (గుంటూరు) సమస్యలకు అనుగుణంగా తన అభిప్రాయాన్ని హైకమాండ్ కు వెల్లడిస్తానన్నారు.
ఇదే సందర్భంగా సీమాంధ్ర ఉద్యమంపై మాట్లాడిన డొక్కా.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అరవైఐదు రోజులుగా పనులన్నింటినీ మానుకుని ఉద్యమం చేయడం చాలా బాధాకరమన్నారు. దానివల్ల పిల్లల చదువులు, ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.