: అంతరిక్షంలో కొత్త రసాయనం


అంతరిక్షంలోని పలు గ్రహాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వ్యోమనౌకలను పంపించి పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో శనిగ్రహం యొక్క ఉపగ్రహం అయిన టైటాన్‌పై మనకు ఉపకరించే ఒక రసాయనాన్ని తొలిసారిగా కనుగొనడం జరిగింది. ప్లాస్టిక్‌ తయారీకి అవసరమయ్యే ప్రొపిలీన్‌ అనే రసాయనాన్ని అంతరిక్షంలో గుర్తించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శనిగ్రహం ఉపగ్రహం టైటాన్‌పై పరిశోధనలు సాగించడానికి కేసిని అనే వ్యోమనౌకను పంపింది. ఈ వ్యోమనౌక అక్కడ ప్లాస్టిక్‌ తయారీకి అవసరమైన ప్రొపిలీన్‌ అనే రసాయనాన్ని గుర్తించింది. ఈ రసాయనాన్ని ఆహారం నిల్వ ఉంచే డబ్బాలు, కారు బంపర్లు వంటివాటిని తయారుచేయడానికి ఉపయోగిస్తారు. భూమిపై కాకుండ ఇతర గ్రహాల్లో ఇలాంటి రసాయనాన్ని గుర్తించడం ఇదే ప్రధమం. టైటాన్‌ దిగువ భాగానికి చెందిన వాతావరణంలో తక్కువ మోతాదులో ప్రొపిలీన్‌ ఉన్నట్టు కేసిని ఇన్ఫ్రారెడ్‌ స్పెక్టోమీటర్‌ గుర్తుపట్టింది. గతంలో నాసా టైటాన్‌పై అధ్యయనానికి పంపిన వోయేజర్‌-1 ఇప్పటికే అక్కడ ఉన్న కొన్ని రసాయనాలకు సంబంధించిన సమాచారాన్ని కొంతమేర తెలిపింది. టైటాన్‌ వాతావరణంలో పలు హైడ్రోకార్బన్లు ఉన్నాయని వోయేజర్‌ గుర్తించింది. ప్రొపేన్‌ వంటి భారమూలకాలనుండి ప్రొపైన్‌ వంటి తేలికపాటి మూలకాల వరకూ రకరకాల మూలకాలగురించి ఈ అన్వేషణలో తెలిసింది. కానీ మధ్యరకం మూలకాలైన ప్రొపిలీన్‌ తరహా మూలకాల గురించి తొలిసారిగా ఇప్పుడే తెలిసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News