: పెగ్గు పెరుగుటకు కారణాలేమనగా...!


చక్కగా బార్‌కు వెళ్లి ఏదో కాస్త మందేసి తర్వాత చల్లగా బయటికి వచ్చేసేవారు కొందరుంటే మరికొందరు కూర్చుని పెగ్గుల మీద పెగ్గులు లాగించేస్తుంటారు. ఆనక తీరిగ్గా బాధపడుతుంటారు... ఎక్కువ తాగేశామని. ఇలాంటివారి విషయంలో ప్రత్యేక సర్వే చేస్తే అందులో తేలిన విషయం ఏమంటే... ఇలా పెగ్గుమీద పెగ్గు లాగించేయడం అనేది వారి తప్పు కాదట... సదరు గ్లాసు తప్పట...!! కాబట్టి మీ గ్లాసును మార్చుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.

మందుబాబులు తాము లాగించే పెగ్గు పెరిగిపోవడానికి కారణం సదరు గ్లాసేనట. దీనితోబాటు ఆ గ్లాసు పరిమాణం, ఆకారం, మందుపోసుకునే తీరు, వారి చుట్టూ ఉన్న వాతావరణం ఇలా అన్ని కూడా మందు తాగేవారు ఎంత తాగుతారనే విషయాన్ని నిర్ణయిస్తాయని పరిశోధకులు తేల్చారు. వెడల్పుగా ఉండే గ్లాసులో ఎంత పోసుకున్నా తక్కువగా కనిపిస్తుందట. అదే సన్నగా ఉండే గ్లాసులో తక్కువ పోసుకున్నా ఎక్కువగా కనిపిస్తుందట. ఫలితంగా 9 నుండి 12 శాతం దాకా తక్కువ తాగుతారట. గ్లాసును చేతితో పట్టుకుని మందు పోసుకోవడంకన్నా కూడా బల్లపై పెట్టి మందు పోసుకుంటే మేలని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు... చక్కగా కనిపించేలా ఉండే గాజు గ్లాసులో నీళ్లలాగా ఉండే మందును పోసుకుంటే ఎక్కువగా తాగేస్తారట. అలాకాకుండా రంగుల్లో ఉండే మందును 9 శాతం తక్కువ గ్లాసులో పోసుకుంటారట. ఈ విషయాలన్నీ కూడా పరిశోధకుల పరిశీలనలో తేలిందట. కాబట్టి పెగ్గు పెరిగిపోవడానికి కారణం మీ తప్పు కాదు... దానికి పైన చెప్పినవన్నీ కూడా కారణాలు కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనించి పెగ్గు తగ్గించుకుంటే మేలేకదా...!

  • Loading...

More Telugu News