: ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం: అశోక్ బాబు


రాజీనామా చేయని ఎంపీల ఇళ్లు ముట్టడిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. ఎంపీలు రాజీనామా చేశామని చెబుతున్నారే తప్ప.. అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారని, అలాంటి రాజీనామాలు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? అని ఆయన ప్రశ్నించారు. ఆ రాజీనామాల వెనుక ఎంపీల ఉద్దేశాన్ని తప్పు పట్టలేమని, అయితే వారు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే రాజీనామా చేసిన ఎంపీలు ఢిల్లీలో వారికి కల్పించిన సౌకర్యాలను వదులుకోవాలని అశోక్ బాబు సూచించారు. క్వార్టర్లు ఖాళీ చేయడంతోపాటు, ఎంపీ కోటాలో విమాన ప్రయాణాలు చేయరాదని అన్నారు.

రాజీనామాపై స్పీకర్ ఆమోదం అనేది సాంకేతిక కారణం మాత్రమేనని, కానీ ఎంపీలు నైతికంగా రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. రాజీనామాలు చేసిన ఎంపీల చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం అని అశోక్ బాబు అన్నారు. నేతలు ప్రజలతో నడవడాన్ని జీవితమనుకుంటున్నారో.. లేక, పదవే జీవితం అనుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అశోక్ బాబు తెలిపారు. రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతున్న నేతలు తక్షణం రాజీనామాలు చేసి వారిని గెలిపించిన ప్రజల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.

లేని పక్షంలో రాజీనామా చేయని నేతల ఇళ్లను ముట్టడిస్తామని తెలిపారు. రేపటినుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 2న వైజాగ్ లో పెద్ద ర్యాలీ చేసి కేంద్ర కార్యాలయాలను స్తంభింపజేస్తామని అన్నారు. కేంద్ర కార్యాలయాల్లో సమ్మెకు ప్రణాళిక రూపొందించామని అశోక్ బాబు స్పష్టం చేశారు. ప్రైవేటు బస్సుల నిలిపివేత, ప్రైవేటు స్కూళ్ల మూసివేత అంశాలను తాము పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ కార్యదర్శితో సమావేశం కావాలని పిలుపు వచ్చిందని అన్నారు.

ప్రభుత్వ కార్యదర్శితో కాకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో మాత్రమే తాము చర్చలు సాగిస్తామని ఆయన తెలిపారు. ఈనెల 15 వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News