: గోల్డ్ లోన్ పై ఆర్బీఐ ఆంక్షలు కఠినతరం


'రెండు నిమిషాల్లో గోల్డ్ లోన్.. ఆ వెంటనే చేతికి డబ్బు... సులభమైన డాక్యుమెంటేషన్.. తక్కువ వడ్డీ.. ఎక్కువ రుణం'. ఇలాంటి ప్రకటనలు కోకొల్లలుగా చూశాం. ఇవీ ఖాతాదారులను ఆకర్షించేందుకు కొన్ని సంస్థలు చెప్పే మాటలు. అయితే, ఇకపై ఈ పప్పులు ఉడకవు. బంగారంపై లోన్ అంత సులభం కాదు. పైన చెప్పిన విధంగా వెంటనే లోన్ రావడం చాలా కష్టం. ఎందుకంటే, బంగారంపై రుణాలను కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించింది. దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి రావడంతో ఆర్బీఐ నింబంధనలు కఠినతరం చేసింది.

ఈ నేపథ్యంలో ఇకపై రూ.5 లక్షల కన్నా ఎక్కువ రుణం తీసుకోవాలంటే 'పాన్ కార్డు' తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. లక్ష రూపాయలు, ఆపైన ఇచ్చే రుణాలన్నీ చెక్కు రూపంలోనే చెల్లించాలి. అటు 'రెండు నిమిషాల్లో గోల్డ్ లోన్' అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు కూడా ఇవ్వరాదని చెప్పింది. ఆభరణాల విలువ మదింపుపైనా రిజర్వ్ బ్యాంక్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రుణం తీసుకునే నాటికి నెలరోజుల ముందు సగటు ధర ఆధారంగా రుణం ఇవ్వాలి. అదికూడా బంగారం విలువలో 60 శాతం మాత్రమే ఇవ్వాలి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. 20 గ్రాములకన్నా దాటి రుణం తీసుకోవాలనుకుంటే బంగారం కొన్న రశీదులు తప్పనిసరి. చాలామంది చోరీ చేసిన బంగారాన్ని కుదవపెట్టి రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే ఆర్ బీఐ ఈ నిబంధనలు పెట్టింది.

ప్రస్తుతం బ్యాంకులు, గోల్డ్ లోన్ సంస్థలు ఇవేమి చూడకుండా లోన్లు జారీ చేస్తున్నాయి. గోల్డ్ లోన్ సంస్థలు ఇష్టారాజ్యంగా రుణాలు జారీ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల కింద రుణాల ఇస్తున్నాయి. తాజా నిబంధనలతో ఇలాంటి లోన్లకు అడ్డుకట్ట వేస్తోంది ఆర్ బీఐ. ప్రతి రూపాయి గోల్డ్ లోన్ కు లెక్క చూపాల్సిందే. పూర్తిగా బంగారం వ్యాపారమే లక్ష్యంగా ఏర్పాటైన సంస్థలకు ఈ నిబంధనలు గట్టి దెబ్బే అని చెప్పొచ్చు.

ఐదేళ్లలో మూడురెట్లు ధర పెరిగిన బంగారం ఆపదలో ఆదుకునే వస్తువుగా మారింది. ఆదే ఇప్పుడు దేశ ఆర్ధిక వ్యవస్థకు సవాల్ విసురుతోంది. గోల్డ్ లోన్ సంస్థలు కుప్పలు తెప్పలుగా రుణాలు ఇవ్వడం, జనం ఆ రుణాలతోనే మళ్లీ బంగారం కొనడం జరుగుతోంది. పసిడి వినియోగంలో వచ్చిన ఈ మార్పు ఆర్ధిక అస్థిరతకు దారి తీసింది.

90 శాతం బంగారం విదేశాల నుంచి దిగుమతి అవుతున్నందున మనదేశ విదేశీమారక నిల్వలు అడుగంటాయి. 2008 ఆర్ధిక సంక్షోభం మొదలు కిందటి ఏడాది వరకు బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గోల్డ్ లోన్ సంస్థలు పోటీపడి మరీ గోల్డ్ లోన్లు జారీ చేశాయి. మణప్పురం, ముత్తూట్ వంటి గోల్డ్ లోన్ సంస్థలైతే గల్లీకో బ్రాంచ్ ను తెరిచాయి. ఈ మోజులో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా అదే బాటను అనుసరించాయి. ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు చేస్తూ ముందూ వెనకా ఆలోచించకుండా కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చాయి. ఈ విచ్చలవిడితనమే ఇప్పుడు దేశ ఆర్ధిక అస్థిరతకు దారి తీసింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఆలస్యంగానైనా కళ్లు తెరిచిన రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కఠినతరం చేసి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

  • Loading...

More Telugu News