: లక్ష కోట్ల సంపదకు వారసులెవరో...?
అరుణాచలం సినిమాలో కోట్ల రూపాయల సంపద హీరోకు లభిస్తుంది... అయినా తనకు సంపద వద్దని దాన్ని ట్రస్టుకే తిరిగి ఇచ్చేస్తాడు హీరో. ఈ సినిమా సంగతి ఏమోగానీ... నిజంగానే అక్కడ లక్ష కోట్ల విలువైన సంపద ఉంది. కానీ దాని యజమాని ఎవరు? అనే విషయం మాత్రం తెలియడంలేదు. దీంతో అంత సంపదా గోదాములో మూలుగుతోంది.
రష్యా రాజధాని మాస్కో విమానాశ్రయంలో 2007 ఆగస్టు 7వ తేదీన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుండి 200 చెక్కపెట్టెలు మాస్కో లోని షెరెమిటియో విమానాశ్రయానికి వచ్చి చేరాయి. అందులో ఒక్కో పెట్టెలో వంద మిలియన్ యూరోల చొప్పున మొత్తం 20 బిలియన్ యూరోలు అనగా సుమారు లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ మొత్తం ఎవరిది? అనేది మాత్రం ఇంతవరకూ తేలలేదు. ఎందుకంటే, దీని యజమాని ఇంతవరకూ ఎవరూ కూడా ఈ సంపదను స్వాధీనం చేసుకునేందుకు రావడంలేదు.
ఈ విషయం తెలిసి కొందరు తామే దీనికి అధికారులం అంటూ వచ్చినా కూడా తగు ఆధారాలను చూపకపోవడంతో సంపద అలాగే పడివుంది. ఇది సద్దాం హుస్సేన్‌కు చెందిన రహస్య సంపద కావచ్చునని ఒక నిఘా అధికారి అభిప్రాయం. అయినా కూడా సద్దాం ఉరితీతకు గురైన ఎనిమిది నెలల తర్వాత ఈ సొమ్ము ఇక్కడకు ఎందుకు చేరింది? అనేది కూడా మరోప్రశ్న. మరోవైపు లిబియా నియంత కల్నల్ గడాఫీకి చెందినదై ఉండవచ్చని మరో వాదన. రష్యా మాఫియాలపైనా, అవినీతి అధికారులపైన కూడా నిఘా అధికారులకు అనుమానాలున్నాయి. కేసులకు భయపడి వారు ఈ సొమ్మును స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడుతున్నారేమోనని అధికారులు భావిస్తున్నారు.
ఆరేళ్లుగా ఈ సొమ్ము ఎవరిది? అనే విషయం తేలకపోయినా కూడా రష్యా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోకుండా సరైన ఆధారాలతో సొమ్ము యజమాని వస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సొమ్ము జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంకు గ్రూప్‌నకు చెందిన బ్యాంకు నుండి వచ్చినట్టు సమాచారం ఉన్నా కూడా అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు. ఫర్జిన్ కొరోరియన్ మొత్లాగ్ అనే ఇరానీ దేశానికి చెందిన వ్యక్తి ఈ కార్గోను పంపినట్టు వే బిల్లు మీద ఉన్నాకూడా సదరు మొత్లాగ్ కూడా వచ్చి ఆ సొమ్ము తనదేనని ఇప్పటివరకూ చెప్పకపోవడంతో సొమ్ము పంపిన వ్యక్తి బినామీ పేరుతో పంపాడేమోననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లక్ష కోట్ల సంపద యజమాని లేక అలా మూలన పడివుంది...!!